జాతీయ వార్తలు

2014 ఎన్నికలు: పీఎం రేసులో మోడీ వర్సెస్ రాహుల్!

వచ్చే 2014 ఎన్నికల్లో దేశ ప్రధానమంత్రి రేసులో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ, కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీల మధ్య ప్రత్యక్ష యుద్ధం సాగే అవకాశం ఉన్నట్టు అమెరికా కాంగ్రెస్ పరిశోధనా సంస్థ (కాంగ్రెస్ రీసెర్స్ సర్వీస్ - సీఆర్ఎస్) తయారు చేసిన నివేదికలో పేర్కొంది. ఈ ఎన్నికల్లో హిందుత్వవాదం కంటే.. అభివృద్ధి, సమర్థ పాలనే అత్యంత కీలకాంశాలుగా మారే అవకాశం ఉందని ఆ నివేదిక తెలిపింది.

అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ రాజకీయ స్థితిగతులను ఈ నివేదిక వివరించింది. వచ్చే 2014 సార్వత్రిక ఎన్నికల్లో దేశ ప్రధానమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ పేరును ప్రకటించవచ్చని ఈనెల ఒకటో తేదీన విడుదల చేసిన సీఆర్ఎస్ నివేదిక పేర్కొంది.

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అత్యంత శక్తివంతమైన మహిళగా ప్రశంసలు అందుకుంటున్నప్పటికీ ఆమె విదేశీయత ప్రధానమంత్రి రేసులో వెనక్కి నెడుతోంది. ఆమె నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో వెలుగు చూస్తున్న కుంభకోణాలు కూడా ఆమె ప్రతిష్టను మసకబార్చినట్టు ఆ నివేదిక పేర్కొంది. అందువల్ల 2014 ఎన్నికల్లో ప్రధానమంత్రి రేసులో నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీల మధ్యే ప్రత్యక్ష పోరు సాగే అవకాశం ఉన్నట్టు ఆ నివేదిక పేర్కొంది.


సింగరేణిలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి: రాష్ట్రంలో తీవ్ర విద్యుత్ సంక్షోభం
సకలజనుల సమ్మె తొలుత విద్యుత్ ఉత్పత్తిపై తీవ్ర ప్రభావాన్ని చూపబోతోంది. సమ్మెలో సింగరేణి కార్మికులు పాల్గొనడంతో అక్కడ బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో రాష్ట్రంలోని ప్రధాన థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తికి తీవ్ర ఆటంకం కలుగుతోంది.

బొగ్గు నిల్వలు తరిగిపోవడంతో రామగుండం ఎన్టీపీసీలో 700 మెగావాట్ల విద్యుదుత్పత్తి నిలిపివేశారు. అదేవిధంగా కొత్తగూడం థర్మల్ పవర్ స్టేషన్ తోపాటు రాష్ట్రంలో ఇతర థర్మల్ విద్యుత్ కేంద్రాల్లోనూ పరిస్థితి ఇలాగే మారింది.

ఒక్కసారిగా విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడంతో రాష్ట్రం తీవ్ర విద్యుత్ సంక్షోభం ఎదుర్కోనుంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ కోతలు విధించాలని నాలుగు డిస్కంలకు ట్రాన్స్‌కో ఆదేశాలు జారీ చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో 6 గంటలు, మండలాల్లో 4 గంటలు కోత విధించడానికి అధికారులు రెడీ అవుతున్నారు.